న్యాయం కోసం పదేండ్ల ఎదురుచూపులా?

న్యాయం కోసం పదేండ్ల ఎదురుచూపులా?

సత్వర  న్యాయమనేది  రాజ్యాంగంలోని  ఆర్టికల్ 21లో  మిళితమై ఉంది.  కానీ,  జీఎన్  సాయిబాబా  దాదాపు  పది సంవత్సరాలు న్యాయంకోసం ఎదురు చూశాడు.  ఈక్రమంలో  ఎట్టకేలకు అతను  నిర్దోషిగా విడుదలయ్యాడు. 2014వ  సంవత్సరంలో  అతడి మీద  సె.18  చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టంతోపాటు మరికొన్ని సెక్షన  కింద  కేసు నమోదైంది.  అతడిని  అరెస్టు చేసి మావోయిస్టులతో  సంబంధాలు ఉన్నాయని మహారాష్ట్ర ప్రభుత్వం అభియోగాలు మోపింది.  

మొదటి నుంచి  సాయిబాబాపై  మోపిన అభియోగాలు  ప్రశ్నార్థకంగానే ఉన్నాయి.  అతడి  కేసుని  విచారించిన  ట్రయల్​ కోర్టు మూడు సంవత్సరాల  తరువాత  సాయిబాబాను  నిర్దోషిగా నిర్ధారించింది.  అనంతరం 14  అక్టోబర్​ 2022న  బొంబాయి డివిజన్​ బెంచ్​ సాయిబాబాను మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది.  వాళ్లని ప్రాసిక్యూషన్ చేయడానికి కావాల్సిన ‘అనుమతి’ అనేది కేసు విచారణ తరువాత ఇచ్చారన్న కారణాన్ని పేర్కొంటూ వారిని కేసు నుంచి విడుదల చేసింది.  కానీ,  తీర్పు వెలువడిన కొద్దిగంటల్లోనే  మహారాష్ట్ర  ప్రభుత్వం  సుప్రీంకోర్టులో  ఈ తీర్పును  సవాలు చేస్తూ దరఖాస్తుని దాఖలు చేసింది.

కేసులో అంత అత్యవసరం ఏముందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ అప్పీలు గురించి అప్పటి ప్రధాన న్యాయమూర్తి యు.యు లలిత్ ముందు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా  ప్రస్తావించడానికి ప్రయత్నించారు. అప్పటికే  ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఆరోజు విచారణను ముగించింది.  ఆ తరువాత ఈ అంశాన్ని జస్టిస్  డీవై చంద్రచూడ్​ బెంచ్​ ముందు సొలిసిటర్​ జనరల్​  ప్రస్తావించారు. అక్కడ  కూడా  హైకోర్టు  ఆర్డరు  మీద స్టే ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. కానీ, కోర్టు స్టేని మంజూరు చేయలేదు.  ఆ తరువాత  అసాధారణ  పరిణామం జరిగింది.  న్యాయమూర్తులు  బేలా త్రివేది,  ఎంఆర్​ షా  నేతృత్వంలో  ఈ అంశాన్ని  విచారించడానికి శనివారం రోజున బెంచ్​ను  అప్పటి  ప్రధాన న్యాయమూర్తి యు.యు  లలిత్​ ఏర్పాటు చేశారు.  అంత త్వరగా  బెంచ్​ని  ఎందుకు  ఏర్పాటు  చేశారో  తెలియదు. 

కేసులో సాంకేతికత, మెరిట్​లను చూసి తీర్పు ప్రకటించాలి

సాంకేతిక  తప్పిదాల కారణంగా  కేసులోని  ముద్దాయిలను  విడుదల చేయడం సరైంది కాదని,  కేసులోని  మెరిట్​ను చూసి తీర్పును  ప్రకటించాలని సుప్రీంకోర్టు  ప్రత్యేక  ధర్మాసనం అభిప్రాయపడి కేసుని తిరిగి బొంబాయి హైకోర్టుకి పంపించింది.   సాంకేతికత,  మెరిట్​ రెండు  అంశాలని  పరిశీలిస్తూ తీర్పు చెప్పాలని,  ఈ కేసు  విచారణని  మరో బెంచ్​కి  అప్పగించాలని  ప్రత్యేక  ధర్మాసనం బొంబాయి  హైకోర్టుని ఆదేశించింది. ఉగ్రవాద సంబంధిత నేరాలు  చేయడానికి  కావాల్సింది ‘మెదడు’ అని,  సాయిబాబా వంటి  దివ్యాంగ సీనియర్​ సిటిజన్​కు  గృహనిర్బంధం  సరిపోదని జైలుకు పంపించాలని  సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.

బొంబాయి హైకోర్టు అతడి కేసుని  తిరిగి  విచారించింది.  గత మార్చి నెలలో  సాయిబాబాను  నిర్దోషిగా  కోర్టు  ప్రకటించింది.  అతడు 90శాతం అంగవైకల్యం కలిగి ఉన్నాడు.  సాయిబాబా  జైల్లో  ఉన్నప్పుడు ఎక్కువసార్లు ఏకాంత నిర్బంధంలో ఉన్నాడు.  ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను కుట్ర పన్నాడని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు.  అన్నీ అస్పష్ట ఆరోపణలు. నిందితులు ఒకరినొకరు పరిచయం కలిగి ఉన్నారని, ఉగ్రవాద చర్యలకు పాల్పడినారని ప్రాసిక్యూషన్  నిరూపించలేకపోయిందని ,కేసు బలహీనమైనది’ అని సాయిబాబాని రెండోసారి నిర్దోషిగా ప్రకటించిన బొంబాయి హైకోర్టు డివిజన్​ బెంచ్​లోని న్యాయమూర్తులు వినయ్​జోషి, వాల్మీకి ఎస్ఏ  మెనెజెస్​లు అభిప్రాయపడినారు. ఇలాంటి బలహీనమైన కేసులో  సాయిబాబా  ఎనిమిదిన్నర  సంవత్సరాలకు  మించి జైల్లో ఉన్నాడు. 

నేరం నిరూపణ జరిగేంతవరకు..నిందితుడిని అమాయకుడిగానే పరిగణించాలి

ఈ తీర్పుకు  వ్యతిరేకంగా  ప్రాసిక్యూషన్​11 మార్చి 2024న  సుప్రీంకోర్టులో  అప్పీలుని  దాఖలుచేసి  స్టే ఇవ్వమని  సుప్రీంకోర్టును కోరింది. అయితే,  సుప్రీంకోర్టు  న్యాయమూర్తులు  జస్టిస్ గవాయ్,  జస్టిస్ సందీప్​ మెహతా నేతృత్వంలోని  ధర్మాసనం  తీర్పుపై  స్టే  మంజూరు చేయడానికి నిరాకరించింది.  నేరం  నిరూపణ  జరిగేంతవరకు  ఒక వ్యక్తి  అమాయకుడిగానే పరిగణించాల్సి ఉంటుంది.

ముంబయి హైకోర్టు తీర్పులో అతడు అమాయకుడు అన్న భావన మరింత బలపడిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.  శిక్షపడినప్పుడు ఆ తీర్పుపై  స్టే అడగటం  సహజ పరిణామం.  కానీ,  నిర్దోషిగా  విడుదలైనప్పుడు అలా స్టే అడగటం అసహజ పరిణామం. సరిగ్గా ఇలాంటి అభిప్రాయాన్నే  సుప్రీంకోర్టు వెలిబుచ్చింది.  90 శాతం అంగవైకల్యం ఉన్న సాయిబాబా అనారోగ్యం కారణంగా ఈ మధ్య మరణించాడు. అతన వీల్​చైర్​కే  పరిమితం అయిన వ్యక్తి.  గాల్​బ్లాడర్​లోని  రాళ్లకు  శస్త్రచికిత్స చేసిన తరువాత  అనారోగ్య  సమస్యల కారణంగా అతను  మరణించాడు. దీనికి కారణం చిన్నది కాదు. ఇరుకైన సెల్​లో అతను  అనుభవించిన సుదీర్ఘ ఖైదు కూడా ఓ కారణం. తన నిర్దోషిత్వాన్ని  సాయిబాబా నిరూపించుకోవడానికి  అతను  సుదీర్ఘ పోరాటం  చేయాల్సి వచ్చింది.  ఈ పోరాటంలో  దాదాపు 10 సంవత్సరాలు విలువైన కాలాన్ని అతను కోల్పోయాడు.  ‘పది సంవత్సరాలు’ అన్న విషయం మీద 2019వ సంవత్సరంలో ఓ ప్రధాన దినపత్రికలో ఓ వ్యాసం రాశాను. ‘యాభై సంవత్సరాలు తరువాత’ అనే  పేరుతో ‘మా వేములవాడ కథలు’లో ఓ కథ రాశాను. 

పది సంవత్సరాల కాలంలో ఎన్నో మార్పులు

పది సంవత్సరాల కాలంలో  మనలో చాలా మార్పులు జరిగి ఉండవచ్చు. పిల్లలు పెద్దవారై ఉంటారు. పై చదువులకు విదేశాలకు వెళ్లి ఉంటారు. రెండుసార్లు ఎన్నికలు జరిగి ఉండవచ్చు. సెర్చ్​ ఇంజిన్లు మారిపోయి ఉండవచ్చు.  అరవై సంవత్సరాలు దాటినవారు వృద్ధులై పోయి ఉండవచ్చు. ఈ పది సంవత్సరాలలో ఇంకా చాలా చాలా జరిగి ఉండవచ్చు. కానీ,  సాయిబాబా జీవితంలో ఈ పది సంవత్సరాలు కష్టంగా జరిగి ఉండవచ్చు.  

డేరాబాబాలు పేరోల్​ మీద చాలాసార్లు బయటకు వచ్చి ఉండవచ్చు. కానీ, సాయిబాబా.. అతడి తల్లి చనిపోయినా కూడా బయటకు రాలేకపోయాడు. ఏమైనా ఈ పది సంవత్సరాలు విచారణ, నిర్బంధం దేశ చరిత్రలో మిగిలిపోతాయి. సాయిబాబాకి జరిగిన ఈ పది సంవత్సరాల నష్టాన్ని కొలవలేం. ఈ పదేండ్లలో అతను కుటుంబం నుంచి విడిపోయాడు. ప్రపంచం నుంచి దూరమైనాడు. ఆరోగ్యం అతడికి దూరమైంది.   బొంబాయి హైకోర్టు తీర్పు ప్రకారం సాయిబాబాని ఈ కేసులో తప్పుగా ఇరికించారు. ఈ పది సంవత్సరాలలో అతడి విడుదల మీద స్టే ఇచ్చిన ధర్మాసనం కనిపించింది.  

రెండవసారి స్టే ఇవ్వని ధర్మాసనం కనిపించింది. సాంకేతికత ఆధారంగా కేసుని కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్​ ఉంది.  మెరిట్​ ప్రకారం అతడిపై కేసుని కొట్టివేసిన ధర్మాసనం ఉంది.  న్యాయం ఉంది.  న్యాయం లేదు.  అంతా సంశయం.  ఒకటి మాత్రం నిజం.  నిర్దోషిని రక్షించడానికి చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగం ఉంది. న్యాయస్థానాలు ఉన్నాయి.  అయినా, అతను పదేండ్లు నిర్బంధంలో ఉన్నాడు. కారణం ప్రభుత్వమా?  మన వ్యవస్థలో లోపాలా?.

- డా. మంగారి    రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్​)​-